✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 *సాధన- సమిష్టి జీవనము - 1* 🌻
ప్రస్తుతము వర్తిస్తున్న కుంభయుగములో ఆధ్యాత్మిక సాధనకు సమిష్టి జీవనములో భాగస్వామ్యము తప్పనిసరి అని పరమగురువులు ఉపదేశిస్తున్నారని అందరికీ తెలుసు.సంఘములో మెలగడంలో ఎగుడుదిగుడులు సర్దుకోక పోవడం వల్ల సాధన స్తంభిస్తుందనేది యథార్థము.
సాధకుడు జపతపాలు, ప్రార్థనా హోమాలు శ్రద్ధగా నెరవేర్చవచ్చు ఇవన్నీ భక్తి సాధనకు సామాగ్రియే గాని భక్తి కావు. సమాజంలో నిరంతరమూ అంతర్యామిని దర్శిస్తూ, అ అనుభూతిలో ప్రతి కర్తవ్యము అంతర్యామికి అర్చనగా చేయడంలో సాధన ఎదుగుతుంది.
సాధకుడు ఇందుకుగాను తాను పూజించే ఏ గురువును అయినా ఇష్టదేవతనయినా సరే సర్వాంతర్యామిగా ముందు భావనలో రూఢీచేసుకోవాలి. అలా లేని సందర్భంలోనే, వివిధమార్గాలు, వివిధ గురువులు, మతాలు గోచరించి, ఎక్కువ తక్కువలు, కలహాలు ఏర్పడతాయి.
అంతేకాదు సాధకుడు నిర్వర్తించే జపతపాదులు గాని, సేవాకార్యక్రమాలు గాని యావజ్జీవితము శ్రద్ధగా అనుష్ఠించాలి. మంచి పనులను ఏ మాత్రము విడువకుండా, ప్రతిదినము ఒకే సమయానికి అభ్యాసం చేస్తూ పోతేగాని, వానిలో దృఢత్వము రాదు, శ్రద్ధ ఏర్పడదు.
కాని ఇందులో ఒక ఇబ్బంది ఎదురవుతుంది, ఒక మంచిపనిని ఉదాహరణకు హోమియో వైద్య సేవను ప్రారంభించినప్పుడు కలిగే ఉత్సాహము, కార్యదీక్ష కొన్నేండ్లు అయ్యేసరికు క్రమంగా మాటు పడుతుంటాయి. ఇక సేవ యాంత్రికముగా మాత్రమే సాగుతుంటుంది.
సాధకుని ద్వారా జరిగే సేవ వలన సమాజంలో వారికి ప్రయోజనం చేకూరవచ్చునే గాని, అతనికి మాత్రం వికాసము, పరిశుద్ధి లభింపక, ఎదుగుదల ఆగిపోవును.
......✍ *మాస్టర్ ఇ.కె.*
(To be Continued)
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment